కోయిలమ్మ - పులి జమున


అంశం:కోయిలమ్మ  -  పులి జమున
శీర్షిక:స్వాగత గీతం
కవితాసంఖ్య:129

గున్నమావి తోటలో
కొమ్మల మాటున కోయిలమ్మ
లేతమావి చిగుళ్లు తిని
మత్తిల్లిన ఎలకోయిల
కుహూకుహూ రాగాలతో
వీనుల విందు చేసే
మధుర సుస్వరాలతో
నవ వసంతాగమనానికి
స్వాగత గీతమాలపిస్తోంది
మల్లెల సౌరభాలను
తుమ్మెద ఝంకారాలను
మయూర నృత్యాలను
ప్రకృతి పరవశాలను
తన జతగా చేసుకుని
బాల భానుని నులివెచ్చని
కిరణాలకు పుడమి పులకించగా
వెన్నెల వెలుగులను
వెంటబెట్టుకుని
నూతనోత్సాహం తో
నూతన వత్సరానికి
ఆహ్వానం పలుకుతూ
చైతన్య రాగమాలపిస్తోంది
నేడు హరితవనాలు అంతరించి
కోకిలమ్మ ఆవాసం కరువై
ముందుతరాలకు తన ఉనికి
కనుమరుగై పోతుంటే
మోడుబారిన మ్రానులను చూస్తూ
ఆవేదనను చెందుతూ
మూగబోయిన రాగమౌతోంది

Comments