కోకిలమ్మ - కె.ఎల్.సరోజా రెడ్డి


అంశం  : కోకిలమ్మ - కె.ఎల్.సరోజా రెడ్డి
శీర్షిక     : సంగీత ఝరి
సంఖ్య  : 261
తేదీ      : 21/6/19
*********
చల్లని సాయంత్రం వేళ....
పడమటి సంధ్యారాగం
అపురూప భావాలను
అలవోకగా విసురుతున్నది....

గున్న మామిడి కొమ్మల గుబురులో
ఆకుపచ్చని ఆశల్ని గొంతునిండా నింపుకుని
చిలిపి చిన్నారి కోయిలమ్మ
పూల ఋతువుకు కన్నుగీటుతూ
పరవశాల పాటలపల్లకిలో ఊరేగుతున్నది....

నా మానస సరోవరంలో
మధుర భావాల రాయంచలు
ముగ్ధమోహన రూపంతో
ఆనంద జలకాలాడుతున్నాయి.....

సుస్వరాల సంగీత ఝరులు
పులకింతల పరిమళాలతో
పుడమిని పునీతం చేస్తున్నాయి......

అంతా అనురాగమయం
నవ జీవన వికాసానికి శ్రీకారం
**********

Comments