కోకిలమ్మ - దారల విజయ కుమారి

కోకిలమ్మ  -  దారల విజయ కుమారి
శీర్శిక :మనసు మౌనాలను తట్టిలేపే

*******
రమ్యమైన రాగాలను రువ్వుతూ
కొమ్మలమాటున
కనపడకుండా..వినపడే కోయిల

అనాదిగా..ఆమని నిండుగా
ఆహ్లాదాన్ని నింపుతూ
గురువు నేర్పని గమకాలతో

వలపు తలపులను
మనసు మౌనాలను
తట్టిలేపే కోయిల సరాగాలు

ఎడారి ఎదలలోనూ
పచ్చదనాల ఒయాసిస్సులను
మొలిపించే కోయిల

ఎదలను మెలిపడుతూ..
జ్ఞాపకాలను కలియదిప్పుతూ
పిలవకనే హృదయాంతరాల్లోకి
చొచ్చుకుపోయే తన ఆర్ద్రతా గీతాలు

జీవన కాలంలో...తప్పని శిశిరాలలో..
గాయపడ్డ హృదయాల తడినెరిగి
ఆర్తి గీతాలను ఆలపించే
ఆ నల్లని అందాల గొంతులు

ఆ కుహూ కుహూల కూ..
కలతలున్నాయ్
చేజార్చుకున్న ఆనవాళ్ళున్నాయ్
అమ్మతనపు ఆవేదనలున్నాయ్

చైత్రపు గుండెలకోసం
స్వాంతన గీతాలనిచ్చి
చల్లగా మెల్లగా తరళిపోయే
ఆమని వైభవాలు..ఈ కోకిలమ్మలు

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్