గరిక పూల వనం - గంభీరావుపేట యాదగిరి

అంశం:-గరిక పూల వనం

శీర్షిక:-చిగురించని బతుకులు

వాళ్లు
స్వర్గం లాంటి సొంతిల్లు
ముఖం చూసి ఎరుగరు,
కన్నతల్లి లాంటి పుట్టిన ఊరు
చిరునామా కన్నదెప్పుడూ లేదు,
పొట్ట చేత పట్టుకుని
పొరుగూరు చెంత చేరి
కన్నబిడ్డలకు
కడుపారా తిండి పెట్టలేక
సరస్వతీ మాత కటాక్షాన్ని సైతం
సమకూర్చలేక సతమతమౌతుంటరు;

చింపిరి జుట్టుతో
చినిగిన బట్టలతో
దుమ్ము ధూళినే పౌడర్ గా
రుద్దుకొని,
గుడి మెట్ల పైనో
కూడలి గట్ల పైనో
పూజకు పనికిరాని పువ్వులై
బొచ్చ చేతపట్టుకుంటరు;

ఆపై కడుపు మాడితే
పూటకూళ్ళ ఇళ్ల వెనక
కిటికీల వద్ద
గ్రామ సింహాలతో పోరాటం
చేస్తుంటరు,
చెత్త ఉప్పల్లో పడవేసిన
ప్లాస్టిక్ సంచులకై ఆరాటపడుతుంటరు;

సాయంత్రమైతే
చలి వణికించినా
వాన తడిపేసినా
ఫుట్పాత్లపైనా, ఫ్లై ఓవర్ల కింద
కాళ్లు చేతులు కడుపులో దాచుకుని
కటిక నేలమీద
కంటి మీద కునుకు కోసం
పొర్లిపొర్లి ప్రయత్నిస్తుంటరు;

దైవ స్పర్శకు నోచుకోని
గడ్డి పువ్వులై
పూసినా,రాలినా
పలకరించేవారు కరువై
మట్టిలో కలిసిపోతుంటరు, సుగంధాలను అద్దుకోక
ఆదరణకు ముఖం వాచి
చిగురు తొడగని కొమ్మలై
మోడువారినా బతుకీడుస్తుంటరు;

గంభీరావుపేట యాదగిరి
 సిద్దిపేట

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి