గరిక పూలు - వై.కె.సంధ్యశర్మ

నేటి కవిత(19/6/19)
పేరు : వై.కె.సంధ్యశర్మ
ఊరు:చిత్తూరు
సంఖ్య:83
అంశం :.గరిక పూలు
శీర్షిక: శాశ్వత చిరునామా!
********

ఆకాశపు నిద్దురకు
తొలి ముద్దునిచ్చి
వేకువ తెర తీసుకుని
సుతారంగా కురిసే
మంచు బిందువుల
రసఝరిలో తన్మయమై
గుప్పున నవ్వేను
పచ్చదనపు వయ్యారపు
సొగసరి !

పచ్చని రవిక తొడిగి
పసుపంచు చీర చుట్టి
నీలివర్ణపు ఛాయలో
మెరిసేటి జాణవై
మెత్తటి పూతోటవై
నేలమ్మ ఒడిలో
ఒదిగిపోయేవు!

వెచ్చని పచ్చికవై
మృదువైన స్పర్శతో
ఆత్మీయంగా
హత్తుకునే ఒత్తైన
నీ చేలో ఒక్క క్షణం
చాలు కదా
మా ఆరోగ్యం
మహా భాగ్యం!

వానమ్మతొ జత కలిసి
తనువంతా పులకించి
వాడిపోని వీడిపోని
తొలి పూజకు నీవే
సదా మాకు రక్షగా!
మా తొలి అడుగులు నీపైనే
మలి పయనం నీతోనే
శ్వాస ఆగినా నీలోనే
విలీనమైనా వికసించేవు
ఓ గరిక పూల తోటగా
శాశ్వత చిరునామాగా!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి