కోకిలమ్మ - వురిమళ్ల సునంద

వురిమళ్ల సునంద, ఖమ్మం
అంశం:: కోకిలమ్మ - వురిమళ్ల సునంద
శీర్షిక:: నీ జాడ ఎక్కడ..?
కవిత సంఖ్య::288
********
మంచు తాగిన గళాన్ని
మౌనంగా సవరించుకుని
కుహూ కుహూ రాగాలతో
వసంతుని సాదరంగా ఆహ్వానించే
వాసంతమా!

గున్న మావి గుబురుల్లో దాగి
లేలేత చివుళ్ళను మేసి
మత్తు మత్తుగా  కొమ్మల ఊగుతూ
ఓయ్ అంటే ఓయ్ అంటూ చిలిపిగా కూసే పంచమాస్యమా!
ఆమనికి ఆనందంగా ఆహ్వానం పలికే
పికమా!!
ఎక్కడమ్మా నీ జాడ..?

హరిత వర్ణపు చీర కట్టుకుని
కలకూజితాలతో
కిలకిలల రవాలతో
మురిసి పోయిన వన దేవత ఒడిలో
ఓలాలడాల్సిన వన ప్రియమా!
ఎక్కడమ్మా ..నీ జాడ?
అడవులన్నీ కాంక్రీటు వనాలై
విస్తరిస్తుంటే
మధుమాసంలో తలదాచుకునేందుకు చోటు లేక
తప్పిపోయావా అనిమకమా!
ఆకుపచ్చని వీణపై హరివిల్లు వర్ణాల
గమకాలతో హొయలు పోవాల్సిన నీవు
అడుగడుగునా విస్తరిస్తున్న ఎడారులలో
బతకలేనని వలస పోయావా
బతుకునే బలి చేసుకున్నావా...

మానవ తప్పిదాలు క్షమించు శ్యామమా!
 మేమంతా నందనవనాలతో స్వాగతం పలుకుతాం
రావమ్మా రా !కుహూ రాగాల కోయిలమ్మా!
మా ఎదనిండా నీ తీయని గానామృతాన్ని నింపిపో..

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి