కోయిలమ్మ - విజయలక్ష్మినాగరాజ్
హుజురాబాద్
అంశం: కోయిలమ్మ - విజయలక్ష్మినాగరాజ్
శీర్షిక:ఎక్కడున్నావు?
లేత చిగుళ్ల ఆనవాళ్లు పుడమికి
కొత్తందాలు తెస్తూ...
వర్ణాలన్ని వయ్యారాలు పోతున్నాయి!
అయినా జాడ లేని కోయిలమ్మ కై
కొమ్మ కొమ్మలో అన్వేషించా!
చివరకు కనిపెట్టి ...
కుశలం అడిగా!
ఆమని రాగాలు రమ్యంగా ఆలాపించే ఆ గొంతు నేడు భయంతో మూగబోయింది!
వసంతమే తానై...
తానే వసంతాన్ని తెచ్చేది
నేడు చేష్టలుడిగి చూస్తోంది!
మావి చివురుల రుచులతో జతకలిసి
కొమ్మల్లో దోబూచులాడుతూ
వయ్యారాలు పోయేది ...
నేడు ఆ రుచులు సహించటం లేదంటోంది!
మల్లెల పరిమళాలను వెంటబెట్టుకుని
వెన్నెల వర్షంలో జంట కచేరీలు చేస్తూ సమ్మోహన పరిచేది
నేడు భయోత్పాతంతో గూట్లోనే ఉండిపోతానంటోంది!
కారణం ఏమిటా అని ...
ఆరా తీయాలని ఆరాటపడ్డాను
తను లేని వేళ
అసంపూర్ణమైన జగతిని చూడలేక!
తీపి రాగాల కోయిలైన నాకు
ఈ ప్రకృతి శరీరానికి నలుపురంగు పులిమింది..
కానీ
అందమైన రూపాన్ని మీకిచ్చింది అని సంతోషపడేలోపే
మీ అంతట మీరే హృదయానికి నలుపును అలుముకుని ...
మానవత్వాన్ని మరిచారు
హెచ్చరిల్లిన హింసాకాండను
పారుతున్న రుధిర ప్రవాహాలను
దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తోన్న ఆర్తనాదాలను
చూసాక...
నా రాగాల పల్లకి కూలిపోయింది
అంటూ
మనిషినైనందుకు మొహం మీదే
తలుపులేసింది
ప్రకృతికే మీరు మాయని మచ్చ అంటూ!
Comments
Post a Comment